న్యూయార్క్: కరోనా సంక్షోభం నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ప్రకటించిన పలు ఉద్దీపన పథకాలను ఉపసంహరించేందుకు తొందరేమీ లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అంటే మరికొంత కాలం ఉపశమన చర్యలు కొనసాగే అవకాశం ఉందని చెప్పకనే చెప్పారు. అయితే, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థను త్వరితగతిన గాడిన పెట్టాలన్న తమ లక్ష్యంలో కొంత అస్థిరత తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే, ప్రభుత్వం ఇప్పటికే మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం భారీ ఎత్తున ఖర్చు చేసేందుకు సిద్ధమైందని తెలిపారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆమె.. ‘న్యూయార్క్ సండే’కు ఇచ్చిన ముఖాముఖిలో ఈ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు కొవిడ్-19ను సమర్థంగా ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల సహకారం అవసరమని సీతారామన్ తెలిపారు. అలాగే సరఫరా గొలుసులను కొవిడ్ వ్యాక్సిన్ తయారీలో వినియోగించే ముడి సరకుల నిమిత్తం నిరంతరం తెరిచే ఉంచాలని కోరారు. 36వ వార్షిక జీ30 ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ సెమినార్లో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.