ఏపీ వైసిపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాలు వివిధ రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పథకాలపై ఇప్పుడు భారతదేశం దృష్టి పడిందని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు. రైతు భరోసా పథకం అద్భుతమైన పథకమని కేరళ ప్రభుత్వం ప్రశంసించిందని వైఎస్ఆర్సిపి ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఇక కేరళ రాష్ట్రం కూడా ఏపీ బాట పడుతుంది అంటూ విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు.
ఏపీ సాగు విధానాలపై కేరళ దృష్టి .. అందుకే కేరళ వ్యవసాయ మంత్రి ఏపీకి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సాగు విధానాలపై కేరళ ఆసక్తి కనబరుస్తుందని చెప్పిన సాయిరెడ్డి, అందుకే ఏపీ విధానాలపై అధ్యయనం చేయడానికి కేరళ ప్రభుత్వం వ్యవసాయ మంత్రిని పంపిందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కేరళ బృందాలు ఇప్పటికే గ్రామాల్లో ఆర్బికే పనితీరును స్టడీ చేస్తున్నారని ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. దేశంలో అనేక రంగాలలో ఏపీ సాధిస్తున్న ప్రగతి వివిధ రాష్ట్రాల దృష్టిని ఆకర్షిస్తుందని వెల్లడించారు. ఒకప్పుడు సాగు విధానాలపై ఏపీ అధికారులు ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారని, కానీ ఇప్పుడు ఇతర రాష్ట్రాల వారు మన దగ్గరికి వస్తున్నారు అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు .