టీ మ్‌ ఇండియా టీ20 ప్రపంచకప్‌ సన్నాహం ఘనంగా మొదలైంది. తొలి ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో కోహ్లి బృందం అదరగొట్టింది. ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌ (70 రిటైర్డ్‌ నాటౌట్‌; 46 బంతుల్లో 7×4, 3×6), కేఎల్‌ రాహుల్‌ (51; 24 బంతుల్లో 6×4, 3×6) విధ్వంసం సృష్టించడంతో సోమవారం భారత్‌ 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించింది. ఓపెనర్లతో పాటు పంత్‌ (29 నాటౌట్‌; 14 బంతుల్లో 1×4, 3×6) మెరవడంతో 189 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది.

దంచేశారు..: పెద్ద లక్ష్యాన్ని భారత్‌ అలవోకగా ఛేదించిందటే కారణం ఓపెనర్లు కిషన్‌, రాహుల్‌లే. ఇద్దరూ దంచేశారు.ధనాధన్‌ బ్యాటింగ్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. మొదట్లో కిషన్‌ నెమ్మదిగా ఆడగా.. రాహుల్‌ మాత్రం ఆరంభం నుంచే విరుచుకుపడ్డాడు. ఇన్నింగ్స్‌ మొదటి ఓవర్లో విల్లీ బౌలింగ్‌లో తన తొలి బౌండరీ సాధించిన రాహుల్‌.. నాలుగో ఓవర్లో (వోక్స్‌) మూడు ఫోర్లు, సిక్స్‌ దంచేశాడు. వెంటనే వుడ్‌ బౌలింగ్‌లో ఇషాన్‌ రెండు ఫోర్లు, సిక్స్‌ కొట్టాడు. ఆ తర్వాత జోర్డాన్‌, అలీ బౌలింగ్‌ల్లో సిక్స్‌లు బాదిన రాహుల్‌.. 9వ ఓవర్లో జట్టు స్కోరు 82 వద్ద వెనుదిరిగాడు. అయితే కిషన్‌ మాత్రం జోరు కొనసాగించాడు. 12వ ఓవర్లో నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డ అతడు రషీద్‌ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లు కొట్టాడు. మరోవైపు కోహ్లి (11) త్వరగానే నిష్క్రమించినా.. పంత్‌ వస్తూనే దాడి మొదలెట్టాడు. అలీ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాదిన పంత్‌, ఇతరులకు అవకాశం ఇవ్వడం కోసం కిషన్‌ రిటైరైనా.. సూర్యకుమార్‌ యాదవ్‌ (8), హార్దిక్‌ (12 నాటౌట్‌) మిగతా పని పూర్తి చేశారు. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ 5 వికెట్లకు 188 పరుగులు చేసింది. బెయిర్‌స్టో (49; 36 బంతుల్లో 4×4, 1×6), మొయిన్‌ అలీ (43 నాటౌట్‌; 20 బంతుల్లో 4×4, 2×6), లివింగ్‌స్టోన్‌ (30; 20 బంతుల్లో 4×4, 1×6) రాణించారు. షమి మూడు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా (1/26), అశ్విన్‌ (0/23) పొదుపుగా బౌలింగ్‌ చేశారు. రాహుల్‌ చాహర్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు.

By admin

Leave a Reply

Your email address will not be published.