ముంచంగిపుట్టు : గ్రామ సచివాలయానికి వచ్చే ప్రతి అర్జీదారుని విషయంలో సిబ్బంది జవాబుదారీతనంతో పని చేయాలని పాడేరు సబ్ కలెక్టర్ అభిషేక్ అన్నారు. మండల కేంద్రంలోగల తహశీల్దార్ కార్యాలయంతో పాటు కిలగాడ, కర్రిముఖిపుట్టు, కించాయిపుట్టు, సుజనకోట గ్రామ సచివాలయాలను ఆయన సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ ధ్రువపత్రాల కోసం అర్జీదారులు పెట్టుకున్న దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనులు పెండింగ్‌లో ఉండకూడదని సచివాలయ సిబ్బందికి సూచించారు. అనంతరం సచివాలయ ఉద్యోగుల, వాలంటీర్ల హాజరు పట్టికలను పరిశీలించారు. కర్రిముఖిపుట్టులో తాగునీరు, పింఛన్ల సమస్యలను పరిష్కారించాలని సబ్ కలెక్టర్‌ను గ్రామస్తులు కోరారు. వివిధ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. వీటిపై స్పందించిన అభిషేక్ సచివాలయాల్లో దరఖాస్తులు పెట్టుకుంటే వెంటనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. సచివాలయాల్లో ప్రభుత్వం కల్పించిన సేవలను అందరూ వినియోగించుకోవాలని కోరారు. ఆయన వెంట తహశీల్దార్ ఎం.శ్యాంబాబు. ఎంపిడిఒ ఎవివి.కుమార్, సర్పంచ్‌లు రమేష్, సుభాష్, శివశంకర్, ఫుల్మెత్తి, ఎంపిటిసి సుబ్బలక్ష్మి పాల్గొన్నారు.