హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో అధికార తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌ను కలిసిన రేవంత్.. తెరాస నేతలు, పోలీసులపై ఫిర్యాదు చేశారు. నిరోష అనే యువతితో కలిసి ఫిర్యాదు చేసిన రేవంత్.. తెరాస నేతలు, పోలీసులు నిరోషపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉద్యోగాల గురించి సభలో అడిగినందుకు దూషించి దాడి చేశారని మండిపడ్డారు.

ఫిర్యాదు చేసిన అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ”హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌ అన్ని రకాల నిబంధనలను తుంగలో తొక్కారు. హుజూరాబాద్ ఉప ఎన్నికను దేశంలోనే ఖరీదైన ఎన్నికగా మార్చారు. పంపకాల్లో వచ్చిన తేడాల వల్లే హరీశ్‌రావు, ఈటల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నిరోషా అనే యువతి నిరుద్యోగ భృతిపై మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తే.. ఆమెపై తెరాస నేతలు దాడి చేశారు. తర్వాత పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్ళిన పోలీసులు అక్కడ కూడా నిరోషను దూషించారు. నిరుద్యోగ యువతపై తెరాస నేతలు దాడులకు పాల్పడుతున్నారు. హుజూరాబాద్‌లో తెరాస, భాజపాలు వందల కోట్ల రూపాయలు వెదజల్లుతున్నారు. ప్రశ్నించే వారిపై జరిగే దాడులను కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రభుత్వ తప్పిదాలను వెలికితీసిన బల్మూరి వెంకట్‌పై దాడి చేశారు. అందుకే వెంకట్‌ను హుజూరాబాద్ బరిలో నిలబెట్టాం.

By admin

Leave a Reply

Your email address will not be published.