హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టుల నిర్మాణం, నీటి వాడకం విషయంలో వస్తున్న సమస్యలను ఆధారంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం అతి జోక్యం చేసుకుంటున్నదని సీపీఐ(ఎం) రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశౄరు. కృష్ణా, గోదావరి నదుల నీటి వాడకానికి గెజిట్‌ ద్వారా రెండు బోర్డులను ఏర్పాటు చేసి ప్రాజెక్టులు, హైడల్‌ విద్యుత్‌ను తన పరిధిలోనికి కేంద్రం తీసుకుంటున్నదన్నారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో కేంద్ర ప్రభుత్వం పెత్తనం మానుకోవాలని, రాష్ట్రాల హక్కులు హరించవద్దని, కేంద్ర గెజిట్‌ను ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నదన్నారు. బోర్డుల నిర్వాహణ ఖర్చులు, తెలుగు రాష్ట్రాలే భరించాలని ..రెండు రాష్ట్రాలపై పెత్తనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకున్నది అని చెప్పారు. ఇప్పటికే కృష్ణా, గోదావరి నది జలాలపై బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు అమలు కాలేదు అని, నీటి పంపకానికి సంబంధించి కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు కోరుతుండగా, దీనికి కేంద్ర జల వనరుల శాఖమంత్రి కూడా అంగీకరించారన్నారు. ప్రస్తుతం దీనికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం బోర్డులు ఏర్పాటు చేసి ఇరు రాష్ట్రాల హక్కులను హరిస్తూ, ఫెడరల్‌ వ్యవస్థకు తూట్లు పొడవడమేనన్నారు. కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ను ఉపసంహరించుకోవాలని, ఇరు రాష్ట్రాలను సమావేశపరిచి కాలపరిమితితో కూడిన నూతన ట్రిబ్యునల్‌ను ప్రకటించాలని, రాష్ట్రాల హక్కులను కాపాడే విధంగా, నదీ జలాల వినియోగాన్ని రాష్ట్రాల పరిధిలోనే ఉంచాలని సీపీఐ(ఎం) డిమాండ్‌ చేస్తున్నదన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.