పెందుర్తిలోని శారదా పీఠాన్ని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ వాణీ మోహన్‌, కమిషనర్‌ హరి జవహర్‌ మంగళవారం సందర్శించారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానందేంద్ర స్వాములతో చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో దేవాదాయ శాఖ ప్రత్యేకంగా ధర్మ ప్రచార నిధిని ఏర్పాటు చేసుకోవాలని, ఆలయాల భద్రత కోసం నియమించిన ప్రైవేట్‌ సెక్యూరిటీ సిబ్బందికి పోలీసు శాఖ ద్వారా శిక్షణను ఇప్పించాలని, ఆలయ వ్యవస్థలో పరిపాలనా పరమైన లోపాలను సరిదిద్దుకోవడానికి ఉద్యోగస్తుల సంఖ్యను పెంచుకోవాలని, ప్రధాన దేవాలయాల ప్రచార రథాలకు మరమ్మతులు చేయించి, గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా హిందూ ధర్మ ప్రచారం నిర్వహించాలని, శాఖాపరంగా హిందూ ధర్మ ప్రచారం చేపట్టడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని శారదా పీఠాధిపతులు సూచించారు. దేవాదాయ శాఖలో లోపాల కారణంగా ఆలయాల్లో ఎదురవుతున్న అనేక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దేవాలయ సాహిత్యం, కవీశ్వరుల రచనలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. పురాణ సభలను ఏర్పాటుచేసి, ఎంపిక చేసిన పండితుల ద్వారా ఆలయాల చరిత్ర, స్థల పురాణం, దేవతామూర్తుల మహిమలను పుస్తకరూపంలో తీసుకురావాలన్నారు. త్వరితగతిన ఆగమ సలహామండలి ఏర్పాటు చేయాలని, ఆలయాల్లో అర్చనా విధులు, కైంకర్యాల విషయంలో తలెత్తిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. శారదాపీఠం త్వరలో చేపట్టబోయే అర్చక సమ్మేళనం, సింహాచలం పంచ గ్రామాల సమస్య తదితర అంశాలపై చర్చించారు. ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని మంత్రి, అధికారులు హామీ ఇచ్చారు.

By admin

Leave a Reply

Your email address will not be published.