ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటేనే ఎస్సీ ఎస్టీ, బిసి, ఇతర తరగతుల వారికి రిజర్వేషన్లు అమలు జరుగుతాయని విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జెఎసి వైస్ చైర్మన్ పడాల రమణ అన్నారు. స్టీల్‌ప్లాంట్, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద జెఎసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటికి 201వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు అవుతాయని కేంద్ర మంత్రులు చెప్పడం ప్రజలను మోసగించడమేనని పేర్కొన్నారు. ఏడు పదుల స్వాతంత్య్ర భారతావనిలో ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలైన చరిత్ర ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. కొత్తగా ఒక పరిశ్రమ కూడా పెట్టన మోడీ ప్రభుత్వం ఉన్న వాటిని అమ్మకాల్లో అగ్రభాగంలో ఉందని ఎద్దేవా చేశారు. కరోనా లాంటి కష్టకాలంలో దేశం తన కాళ్ళ మీద తను నిలబడిందంటే అది ప్రభుత్వ రంగ సంస్థల సహకారంతోనేనని తెలిపారు. అలాంటి వాటిని కారుచౌకగా కార్పొరేట్లకు అమ్మడం దారుణమన్నారు. ఈ దీక్షలో ఎఐటియుసి జిల్లా నాయకులు ఎం.మన్మధరావు. జి.వామనమూర్తి. కె.సత్యనారాయణ, వెంకటేష్, పి.త్రినాధరావు, శంకర్, టివి రావు పాల్గొన్నారు.