కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉధృతంగా పోరాటాలు నిర్వహించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక హరిత హిల్‌ రిసార్స్‌ వద్ద మంగళవారం జరిగిన సిపిఎం అనంతగిరి మండల 6వ మహాసభలో లోకనాథం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సిపిఎంకు పునాది ప్రజలేనని, వారికి ఎల్లాప్పుడు అందుబాటులో ఉండాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం రైతులను కూలీలుగా మార్చేందుకు నల్ల వ్యవసాయ చట్టాలను, కార్మికులను బానిసలుగా మార్చేందుకు లేబర్‌ కోడ్స్‌ తీసుకొచ్చిందని తెలిపారు. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తుందన్నారు. అధికారిక వెబ్‌సైట్‌ల నుంచి ఎస్టీ వాల్మీకి, భగత, తాజాగా గౌడు తెగలను తొలగించడం దారుణమన్నారు. గిరిజనులకు రక్షణకవచంగా ఉన్న 1/70, పీసా చట్టాలను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తుందని విమర్శించారు. సిపిఎం జెడ్‌పిటిసి సభ్యులు దీసరి గంగరాజు మాట్లాడుతూ అనంతగిరి మండలానికే పరిమితం కాకుండా ఏజెన్సీ 11 మండలాల్లో పర్యటించి గిరిజనుల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి జిల్లా పరిషత్‌, ఐటిడిఎ పాలకవర్గ సమావేశాల్లో కృషి చేస్తానని చెప్పారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని పార్టీ కార్యకర్తలను కోరారు.

By admin

Leave a Reply

Your email address will not be published.