నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద మంగళవారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసిపి మహిళా నాయకులు పేడాడ రమణి కుమారి, పీలా వరలక్ష్మి, ధనలక్ష్మి ఆధ్వర్యాన ఆ పార్టీ మహిళా కార్యకర్తలు టిడిపి కార్యాలయ ఆవరణలోకి వెళ్లి ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. దీంతో కార్యాలయ లోపలున్న టిడిపి, టిఎన్‌ఎస్‌ఎఫ్‌, తెలుగు మహిళ నాయకులు అక్కడకు రావడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య కొద్ది సేపు వాగ్వివాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని వైసిపి కార్యకర్తలను కార్యాలయ గేట్‌ బయటకు పంపించారు. ఇంతలో టిడిపి విశాఖ పార్లమెంట్‌ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అక్కడకు రావడంతో ఆయన వాహనాన్ని, తరువాత వచ్చిన తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షులు వంగలపూడి అనిత వాహనాన్ని వైసిపి మహిళా కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసుల జోక్యం చేసుకొని వారిని లోపలకు పంపించారు. అనంతరం వైసిపి కార్యకర్తలు టిడిపి కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. టిడిపి నాయకులకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published.