హు జూరాబాద్ ఉపఎన్నికల్లో తెరాస, భాజపా మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. రెండు పార్టీలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. అభ్యర్థులు, పార్టీల్లోనే కాదు, ఈ ఎన్నిక ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఉన్నంత ఉత్కంఠ ఇప్పుడున్నదని కొందరు అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో పార్టీలు అత్యధిక మొత్తం ఖర్చు చేస్తున్న నియోజకవర్గంగా హుజూరాబాద్ నిలిచిపోయే అవకాశం ఉందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తమ్మీద సవాళ్లు, ప్రతి సవాళ్లతో ప్రచారం హోరెత్తుతోంది. కాంగ్రెస్ పోటీలో ఉన్నా తెరాస, భాజపాల మధ్యనే ముమ్మర పోరు నెలకొంది. రెండు పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో ఆధిపత్యం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రానున్న వారం రోజులు పార్టీలకు కీలకం కానున్నాయి. ఈటల రాజేందర్ రాజీనామాతో వచ్చిన ఉపఎన్నిక అధికార తెరాసకు, ఈటలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈటల భాజపాలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉండగా, తెరాస తరఫున ఆ పార్టీ విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలో ఉన్నారు.. కాంగ్రెస్ నుంచి విద్యార్థి నాయకుడు వెంకట్ పోటీలో ఉన్నారు