విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు రూపకర్త, స్వాతంత్య్ర సమరయోధులు, ఉక్కు సాధకులు కీర్తిశేషులు తమనంపల్లి అమృతరావు 101వ జయంతి, శత జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఉక్కు యాజమాన్యం, ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాలు, శతజయంతి కమిటీ ఆధ్వర్యాన ఉక్కునగరంలోని అమృతరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. శతజయంతి కమిటీ చైర్మన్‌ ఎవి రమణరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి అమృతరావు మనుమడు తమనంపల్లి మోహన్‌ గాంధీ, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, స్టీల్‌ప్లాంట్‌ ఈడి (వర్క్స్‌) కెవి.విద్యాసాగర్‌ ముఖ్యఅతిథులుగా పాల్గొని అమృతరావు త్యాగాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ, నాటి ప్రధాని ఇందిరాగాంధీ మెడలు వంచి, పట్టువదలని విక్రమార్కునిలా ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి సాధించిన ఘన చరిత్ర అమృతరావుకు ఉందన్నారు. ఆయన నిరాహార దీక్ష నిర్ణయం తీసుకోకపోతే ప్లాంట్‌ వచ్చేది కాదని, లక్షలాది మందికి ఉపాధి దొరికేది కాదని పేర్కొన్నారు. ఈ పరిశ్రమను కర్ణాటక రాష్ట్రానికి తరలించాలని నాటి పాలకుల యోచనను ముందే గ్రహించిన అమృతరావు ఒంటరిగా ప్రారంభించిన పోరాటం యావత్‌ భారత దేశాన్ని ఆకర్షించిందని తెలిపారు. ఆయన ధైర్యసాహసాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య మాట్లాడుతూ, స్టీల్‌ప్లాంట్‌ సాధన పోరాటంలో గుంటూరు జిల్లా తాటికొండ గ్రామానికి చెందిన అమృతరావు పాత్ర మరువలేనిదన్నారు. మహనీయుల త్యాగాలను అపహాస్యం చేస్తూ నేటి పాలకులు దేశానికి పట్టుగొమ్మలైన ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో అన్ని కార్మిక సంఘాల నాయకులు, జయంతి నిర్వహణ కమిటీ కన్వీనర్‌ జెర్రిపోతుల మోహన్‌కుమార్‌, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు మంత్రి రాజశేఖర్‌, గంధం వెంకటరావు, వైటి.దాస్‌, కెఎస్‌ఎన్‌ రావు, బోసుబాబు, వరసాల శ్రీనివాసరావు, మస్తానప్ప, దాసరి సురేష్‌, మాటూరి శ్రీనివాసరావు, పరందామయ్య, బలిరెడ్డి సత్యనారాయణ, డివి రమణారెడ్డి, పరందామయ్య, కామేశ్వరరావు, కెఎం.శ్రీనివాసరావు, డేవిడ్‌, దాలినాయుడు, సంపూర్ణం, నాయక్‌, విల్లూరి మహాలక్ష్మి నాయుడు, చంద్ర శేఖర్‌, కెవిడి ప్రసాద్‌, బొండా ఎల్లాజీ, ఎం.నాగేశ్వరరావు, పట్టా రామప్పారావు, అమృతరావు మనువలు తమనంపల్లి దిలీప్‌, తమనంపల్లి విజరు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.