విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన గాజువాక ప్రాంతంలో చేపట్టే ర్యాలీ, బహిరంగ సభను జయప్రదం చేయాలని ఎంఎన్‌ఎస్‌ఎస్‌ అధ్యక్షుడు కె.రవికుమార్‌ పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ నిరసిస్తూ విశాఖ కార్మిక, ప్రజా సంఘాల జెఎసి ఆధ్వర్యాన జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన దీక్షలు గురువారం నాటికి 203వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షల్లో మురికివాడల నివాసులు సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవికుమార్‌ మాట్లాడుతూ, ఈ నెల 30న మధ్యాహ్నం 3 గంటలకు పాత గాజువాక జంక్షన్‌ నుంచి ప్రజా సంఘాల ప్రదర్శన ఉంటుందన్నారు. వినాయక నగర్‌ ఓపెన్‌ ఆడిటోరియంలో సాయంత్రం బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. మోడీ ప్రభుత్వ కార్మిక, కర్షక ప్రజావ్యతిరేక చర్యలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణతో దేశానికి తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్‌ సూరప్పడు, ఎంఎన్‌ఎస్‌ఎస్‌ కార్యదర్శి లక్ష్మీనారాయణ, పరదేశి, అప్పారావు, ఈసర లక్ష్మి, జయమ్మ, భూషణం పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.