ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు బాగా కక్షపూరితమయ్యాయి. కక్ష సాధింపు ఒక రాజకీయ కార్యక్రమం అయింది. రాజకీయాల్లో కక్షలు కార్పణ్యాలు ఎపుడూ ఉన్నవే గాని, ఇవి బాగా ముదిరిపోయినట్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మధ్య రగులుతున్న వైషమ్యం చూస్తే అర్థమవుతుంది.
మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం నుంచి 36 గంటల నిరసన దీక్ష చేపట్టారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద, ఆ పార్టీ నాయకుడు కొమ్మారెడ్డి పట్టాభి ఇంటి మీద దాడులు జరిగినందుకు నిరసనగా ఆయన పార్టీ కార్యాలయంలోనే నిరసన దీక్షకు దిగారు.

అంతకు ముందురోజు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. దీనికి పోటీగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ‘జనాగ్రహ దీక్ష’లకు పిలుపునిచ్చింది.

తెలుగుదేశం పార్టీపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఇది ‘ఇది టెర్రరిస్టు ప్రభుత్వం’ అని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అందుకు ప్రతిగా.. ‘తెలుగుదేశం పార్టీ ఒక టెర్రరిస్టు పార్టీ’ అని రాష్ట్ర పురపాలక మంత్రి బొత్సా సత్యనారాయణ ఎదురుదాడి జరిపారు.

తెలుగు దేశం పార్టీ మీద దాడి జరిపింది జగన్ అభిమానులని, జగన్‌ని దూషించినందుకు వాళ్లు ఆగ్రహించి ఎదురుదాడి చేశారని, దీనికి పార్టీకి సంబంధం లేదన్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేతులు దులిపేసుకున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.