శామీర్పేట్: ప్రేమించిన యువకుడు పెళ్లి చేసుకోవడం లేదని యువతి మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన శామీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తుమ్మ జ్యోతి(34) తన కుటుంబ సభ్యులతో కలిసి మండలకేంద్రమైన శామీర్పేటలో నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా ఓ యువకుడిని ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని తన అక్కచెల్లెళ్లతో చెప్పింది.
ఇటీవల జ్యోతిని ప్రేమించిన వ్యక్తి పెళ్లి విషయం రాగానే మాట దాటవేస్తున్నాడని బాధపడుతోంది. ఈ క్రమంలో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని జ్యోతి ఆత్మహత్య చేసుకుంది. తన చెల్లి వేదవతి ఇంటికి వచ్చే సరికి ఉరివేసుకున్నట్లు గమనించి పోలీసులకు సమాచారం అందించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు శామీర్పేట పోలీసులు తెలిపారు.