పాడేరు ఐటిడిఎలో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో నడుస్తున్న ప్రాథమిక పాఠశాలల్లో పని చేస్తున్న ఒప్పంద ఉపాధ్యాయుల (సిఆర్టిలు)కు రెన్యువల్ ఆర్డర్స్ ఇవ్వకపోవడంతో ఏజెన్సీలో పలు పాఠశాలలు మూతపడ్డాయి. ప్రభుత్వం కొద్దికాలంగా ప్రతి ఏటా విద్యా సంవత్సరం ప్రారంభానికి సిఆర్టిలను రెన్యువల్ చేస్తూ వస్తోంది. కానీ 2021-22 విద్యా సంవత్సరం ప్రారంభమైనా సిఆర్టిలకు రెన్యువల్ ఆర్డర్స్ ఇవ్వకపోవడంతో వారంతా విధులకు హాజరు కావడం లేదు. ఆ ప్రభావం ప్రాథమిక విద్యా బోధనపై తీవ్రంగా పడింది. పాడేరు ఐటిడిఎ పరిధిలో 11 మండలాల్లో 670 జిపిఎస్ పాఠశాలలున్నాయి. అందులో 503 జిపిఎస్ పాఠశాలల్లో రెగ్యులర్ ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. మిగతా 139 పాఠశాలలకు సిఆర్టిలను నియమించి గత విద్యా సంవత్సరం వరకు పాఠశాలలను నడిపించారు. తొలుత రెన్యువల్ ఆర్డర్స్, పెండింగ్ జీతాలు వంటి తదితర సమస్యలు ఉన్నప్పటికీ కొంతకాలం సిఆర్టిలు నిధులు నిర్వహించారు. ఆ క్రమంలోనే 2021-22 విద్యా సంవత్సరానికి రెన్యువల్ చేయాలని ఐటిడిఎ అధికారుల చుట్టూ పలుమార్లు తిరిగారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో నిరసనగా సుమారు నెల రోజులకుపైగా విధులకు హాజరు కావడం లేదు. దీంతో విశాఖ ఏజెన్సీలో 139 జిపిఎస్ పాఠశాలలు మూతపడ్డాయి. పలుమార్లు ఐటిడిఎ పిఒ, టిడబ్ల్యు డిడి దృష్టికి సమస్యను తీసుకెళ్ళినా పరిష్కారం కాలేదని సిఆర్టిలు వాపోతున్నారు. ఐటిడిఎ కార్యాలయం గేటు ఎదుట సెప్టెంబర్ 8న ధర్నా నిర్వహించినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.