సిఎం జగన్మోహన్ రెడ్డిపై టిడిపి నాయకుల అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ వైసిపి ఆధ్వర్యంలో చేపట్టిన జనాగ్రహ దీక్షలు శుక్రవారమూ జిల్లా వ్యాప్తంగా కొనసాగాయి. తగరపువలసలో మంత్రులు వనిత, ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
తగరపువలస : సిఎం జగన్కు రోజు రోజుకూ పెరుగుతున్న ప్రజాభిమానాన్ని చూసి ఓర్వ లేకనే టిడిపి నేతలు లేనిపోని విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. స్థానిక జంక్షన్లో చేపట్టిన జనాగ్రహ దీక్షలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి ఆమె పాల్గొన్నారు. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే గోపాలరావు దీక్షకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో వైసిపి నియోజకవర్గ ఇన్ఛార్జి ముత్తంశెట్టి మహేష్, మూడు మండలాల సర్పంచ్లు, ఎంపిటిసిలు, జివిఎంసి కార్పొరేటర్లు పాల్గొన్నారు. దీక్షల ముగింపునకు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి హాజరయ్యారు.
అరకు రూరల్ : అరకు వేలీ మండల కేంద్రంలో ఎమ్మెల్యే శెట్టి పాల్గుణ ఆధ్వర్యంలో నల్ల దుస్తులు ధరించిన దున్నపోతుపై చెప్పులు దండలు వేసి ఊరేగింపు చేపట్టి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఎంపిపి రంజాపల్లి ఉషారాణి, వైస్ ఎంపిపి కిల్లో రామన్న, డుంబ్రిగుడ ఎంపిపి బి.ఈశ్వరి పాల్గొన్నారు.
