రూ.2 లక్షల కోట్లకుపైగా విలువ చేసే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కారుచౌకగా కేవలం రూ.32 వేల కోట్లకు అమ్మి వేయాలని మోడీ ప్రభుత్వం కుట్ర చేసిందని సిఎఫ్‌టియుఐ జాతీయ అధ్యక్షుడు ఎన్.కనకారావు విమర్శించారు. భారతదేశ చరిత్రలో ఇది ఒక పెద్ద కుంభకోణంగా నిలుస్తుందని మేధావులు, ఆర్థిక నిపుణులు అంటున్నారని తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద విశాఖ కార్మిక, ప్రజా సంఘాల జెఎసి ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు శుక్రవారం నాటికి 204వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతిరూపం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని, దీనిని ప్రభుత్వ రంగంలో కొనసాగించేందుకు ఎటువంటి పోరాటాలు, త్యాగాలకైనా సిద్ధమేనని తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా కేంద్రం చర్యను వ్యతిరేకిస్తున్నారని, ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేసే ఆలోచన మోడీ ప్రభుత్వం విరమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఎఫ్‌టియుఐ నాయకులు కె.లక్ష్మి, దివ్య, భారతి, ఎం.లక్ష్మి, బి.బాలభాను తదితరులు పాల్గొన్నారు.