వీణవంక: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూర్ వెంకట్‌ను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రేవంత్ మాట్లాడుతూ… తెరాస, భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హుజూరాబాద్‌లో గెల్లు చెల్లని నాణెం అని, హుజూరాబాద్ ప్రజలకు వెంకట్ అండగా ఉంటారని వివరించారు.
”గోల్కొండ రిసార్ట్స్‌లో నేను, ఈటల కలిశామని కేటీఆర్ అంటున్నారు. అది బహిరంగ రహస్యమే. ఈటల రాజేందర్‌తో చీకటి ఒప్పందం కోసం కలవలేదు. వేం నరేందర్‌రెడ్డి కుమారుడి లగ్న పత్రిక సందర్భంగా మేమిద్దరం కలిశాం. కేసీఆర్ చేసే కుట్రలన్నీ ఈటల వివరించారు. ఈటల, కిషన్ రెడ్డి భేటీ ఏర్పాటు చేసింది తెరాస కాదా? కిషన్‌రెడ్డి కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేయలేదా? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.