ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షల నిర్వహణలో లోపాలు బోర్డు నిర్లక్ష్యాన్ని చెప్పకనే చెప్పాయి. ప్రైవేటు కళాశాలలపై అధికారులకు అజమాయిషీ లేదని, కనీస వివరాలు కూడా పరిశీలించడం లేదనే విషయమూ స్పష్టమైంది. తొలిరోజు సోమవారం సంస్కృతం, తెలుగు, హిందీ, ఉర్దూ, అరబిక్‌ పరీక్షలు జరిగాయి. మొత్తం 4,59,240 మందికిగానూ 4,29,177 మంది హాజరయ్యారు. 30,063 మంది(6.5 శాతం) పరీక్షలు రాయలేదు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సినాప్స్‌ కళాశాలలోని కొన్ని గదుల్లో పరీక్ష పత్రాలను అరగంట ఆలస్యంగా (9.30 గంటలకు) అందించారు. తమకు పోటీగా ఉన్న కళాశాల విద్యార్థులున్న గదుల్లో పరీక్ష పత్రాల పంపిణీని ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేంద్రంలో కొందరు విద్యార్థులను 9.15 గంటల వరకూ అనుమతించినట్లు తోటి విద్యార్థులు తెలిపారు. దీనిపై తల్లిదండ్రులు పరీక్ష కేంద్రం చీఫ్‌ సూపరింటెండెంట్‌ రవిశంకర్‌కు ఫిర్యాదు చేశారు. కళాశాలల మధ్య ఉన్న పోటీతో విద్యార్థులకు అన్యాయం చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయాన్ని జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి దస్రూనాయక్‌ దృష్టికి ‘ఈనాడు’ తీసుకెళ్లగా సినాప్స్‌ కళాశాలలో పరీక్ష పత్రం ఆలస్యంగా ఇచ్చిన విషయమై ఫిర్యాదులు అందాయని, దీనిపై విచారణ జరిపిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ప్రశ్నపత్రాలు ఆలస్యంగా ఇచ్చినట్టు విద్యార్థులు ఆరోపించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.