డిఆర్డిఎ ద్వారా ఎండాడలోని ఎన్ఆర్ఐ కాలేజీలో చదివి ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణులైనప్పటికీ సర్టిఫికెట్లు ఇవ్వడానికి కాలేజీ యాజమాన్యం నిరాకరించడంపై విద్యార్థులు సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు కేసరి శ్రీలేఖ, పి.లలితా సత్య మీడియాతో మాట్లాడుతూ, ఎస్సి, ఎస్టి, మైనార్టీలకు చెందిన తాము 2019లో డిఆర్డిఎ ద్వారా ప్రభుత్వం కల్పించిన అతి తక్కువ ఫీజులతో ఎన్ఆర్ఐ కాలేజీలో ఇంటర్మీడియట్లో చేరమని చెప్పారు. కోర్సులను బట్టి రూ.23 వేల నుంచి రూ.25 వేల వరకు ఫీజులు చెల్లించామన్నారు. ప్రభుత్వం నుంచి కాలేజీకి రావాల్సిన ఫీజు రాకపోవడంతో ఒక్కొక్కరు గతంలో చెల్లించిన సొమ్మును కలిపి రూ.70 వేలు చొప్పున చెల్లించాలని యాజమాన్యం డిమాండ్ చేస్తోందని తెలిపారు. తామంతా ఎంసెట్ ఎంట్రెన్స్ రాశామని, ఇప్పుడు సర్టిఫికెట్లు లేకుండా కౌన్సెలింగ్కు ఎలా హాజరుకావాలని ప్రశ్నించారు. తాము ఎంసెట్ కౌన్సెలింగ్కు హాజరయ్యే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో డి.దేవి, కె.అఖిల తదితరులు పాల్గొన్నారు.