గుట్టుగా…గుట్కా దందా

మత్తులోయువత భవిష్యత్తు చిత్తు.

పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తోన్న సంబంధిత శాఖల అధికారులు.

గుంటూరు:
జిల్లాలో నిషేధిత గుట్కా విక్రయాలకు అడ్డుకట్ట పడడం లేదు. గుట్కా మత్తులో యువత భవిష్యత్తు చిత్తయిపోతోంది. చట్టాల్లోని లొసగులు, ఇంటిదొంగల సహకారంతో జిల్లాలో కొందరు యథేచ్ఛగా గుట్కా దందాను కొనసాగిస్తున్నారు. విచ్చలవిడిగా బస్తాల కొద్ది గుట్కా ప్యాకెట్లు జిల్లాలోకి వస్తున్నా సంబంధిత శాఖల అధికారులు వీటిని నియంత్రించలేకపోతున్నారు. జిల్లాలో నిత్యం ఏదో ఒక చోట గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. కేసులు నమోదు చేస్తున్నవి తక్కువే అయినా, జిల్లాలో గుట్కా నిల్వలు భారీగా ఉన్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో గుట్కా విక్రయాల నిషేధం అమల్లో ఉంది. అయితే పక్క రాష్ట్రం కర్నాటకలో గుట్కా విక్రయాలకు అనుమతులున్నాయి. దీంతో అక్కడి నుంచి జిల్లాకు చెందిన గుట్కా మాఫియా పెద్ద మొత్తంలోనే గుట్కాను జిల్లాకు తీసుకొచ్చి కిరాణా, పాన్‌షాపులకు అమ్ముతున్నారు. ఈ వ్యాపారం నెలలో కోట్ల లావాదేవీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో గుట్కాపై ఉరుకులు, పరుగులతో పోలీసులు దాడులు నిర్వహించి పట్టుకునే వారు. ప్రస్తుతం ఆ వేగం తగ్గినట్లు కన్పిస్తోంది. గుట్కాపై పోలీసుల పూర్తి స్థాయిలో తనిఖీలు లేకపోవడంతో దీని మాఫియా యథేచ్ఛగా ఈ దందాను సాగిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ప్రతి రోజు గుట్కా విక్రయాలకు సంబంధించి కేసులు నమోదు అవుతున్నాయంటే వాటి అమ్మకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రతి రోజు గుట్కా ప్యాకెట్ల కేసులు జిల్లాలో నమోదు అవుతూనే ఉన్నా వారి కళ్లు గప్పి కోట్లల్లో ఈ దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆదివారం సాయంత్రం మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి లోని కాజలో రెండు వేరువేరు దుకాణాలపై మంగళగిరి రూరల్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి రూ.6వేల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని ఇద్దరి వ్యక్తులపై కేసులు నమోదు చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published.