డీజిల్ ధరల్లో మార్పులు జరిగినప్పుడల్లా ఆర్టీసీ టికెట్ చార్జీలు కూడా మార్చే విధానం తెరపైకి వస్తోంది. ప్రస్తుతం కర్ణాటకలో అమల్లో ఉన్న ఈ విధానాన్ని తెలంగాణ ఆర్టీసీలో కూడా ప్రవేశపెట్టాలన్న నిపుణుల సూచనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ఆర్టీసీపై డీజిల్ భారాన్ని ఎప్పటికప్పుడు తగ్గించ డంతో పాటు, ఒకేసారి చార్జీలు భారీగా పెంచిన భావన ప్రజల్లో లేకుండా ఉంటుందన్న కోణంలో దీనికి ప్రాధాన్యం లభిస్తోంది. దీనిపై తెలంగాణ ఆర్టీసీ కూడా ఆసక్తి కనబరుస్తోంది.
వాస్తవానికి రెండేళ్ల కిందటే ఈ అంశం చర్చకు వచ్చింది. 2019లో ఆర్టీసీలో సుదీర్ఘ సమ్మె అనంతరం పరిస్థితులు తిరిగి సద్దుమణిగే సమయంలో ఆర్టీసీ అధికారులతో సీఎం కేసీఆర్ నిర్వహించిన సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. అదే సంవత్సరం డిసెంబర్లో ఆర్టీసీ చార్జీలు పెంచారు. ఆ తర్వాత డీజిల్ ధరల మార్పులకు తగ్గట్టుగా బస్సు ఛార్జీలు సవరించే విధానాన్ని అనుసరిస్తే ఎలా ఉంటుందన్న కోణంలో చర్చించారు. కానీ ఆ వెంటనే కోవిడ్ సమ స్య రావటంతో అది కాస్తా పెండింగులో పడింది.