పట్నా: ఎన్డీఏతో మిత్రపక్షం జేడీయూ తెగదెంపులు చేసుకోనుందా?  ఆగస్టు 11కు ముందే బిహార్‌లో జేడీయూ-బీజేపీ సర్కార్ కూలిపోనుందా? నితీశ్‌ కుమార్‌ మళ్లీ ఆర్జేడీతో చేతులు కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు అవుననే సమాధానం వినిపిస్తోంది. బిహార్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

మిత్రపక్షం బీజేపీతో సీఎం నితీశ్ కుమార్ చాలా కాలంగా అంటీమున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ఆదివారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశం సహా జులై 17 తర్వాత కేంద్రం నిర్వహించిన నాలుగు సమావేశాలకు నితీశ్ డుమ్మా కొట్టారు. దీంతో ఎన్డీఏ నుంచి ఆయన విడిపోనున్నారనే వాదనలకు మరింత బలం చేకూరింది.

అంతేకాదు నితీశ్ మళ్లీ ఆర్‌జేడీతో జట్టుకట్టాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్, వామపక్షాలను కూడా కలుపుకొని బిహార్లో బీజేపీకి షాక్ ఇస్తూ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆయన ఆయా పార్టీలతో చర్చలు  జరుపుతున్నట్లు కూడా ప్రచారం జోరుగా సాగుతోంది.

ప్రభుత్వంలో భాగమైన బీజేపీతో విడిపోయి మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలని నితీశ్ భావించినా.. అందుకు జేడీయూ ఎమ్మెల్యేలు సుముఖంగా లేనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఆర్జేడీ మద్దతు తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

By admin

Leave a Reply

Your email address will not be published.