భోపాల్: దేశంలో పెట్రోల్ ధరలు (Petrol Price) రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. లీటరు ధర వంద రూపాయల మార్కు దాటిన అనంతరం ఇవి మరింత వేగంగా పైపైకి ఎగబాకుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఓ జిల్లాలో ఏకంగా లీటరు పెట్రోల్ ధర రూ.120 మార్కును దాటింది. ఇక్కడే కాకుండా దేశంలో చాలా ప్రాంతాల్లోనూ పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) ధరలు రూ.110కిపైగా ఉండడం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది.
మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ జిల్లా కేంద్రంలో లీటరు పెట్రోల్ ధర రూ.120.4కు చేరగా.. డీజిల్ ధర రూ.110కి చేరువయ్యింది. వీటితో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన బాలాఘాట్‌లోనూ లీటరు పెట్రోల్ రూ. 119.23పైసలుగా నమోదైంది. రాజధాని భోపాల్‌లోనూ లీటరు ధర రూ.116.62గా ఉంది. మంగళవారం నాడు పెట్రోల్‌పై 36పైసలు పెరగడంతో మరుసటి రోజు రికార్డు స్థాయిలో లీటరు పెట్రోల్ ధర రూ.120 మార్కును దాటినట్లు స్థానిక డీలర్ అభిషేక్ జైశ్వాల్ పేర్కొన్నారు. డీజిల్‌పై 37 పైసలు పెరగడంతో దాని ధర రూ.109.17కి చేరిందన్నారు. దాదాపు 250కి.మీ దూరంలో ఉన్న జబల్పూర్ ఆయిల్ డిపో నుంచి అనుప్పూర్ జిల్లా కేంద్రానికి పెట్రోల్ సరఫరా అవుతుందని.. అందుకే ఇతర జిల్లాలతో పోలిస్తే ఇక్కడ ఇంధన ధరలు మరింత ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు.