ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతోన్న ఉప ఎన్నిక కాక రేపుతోంది.. బీజేపీ మండల అధ్యక్షుడు ఇప్పుడు వైసీపీలో చేరడం హీట్‌ పెంచుతోంది. ఈ విషయాన్ని ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికే తీసుకెళ్లింది భారతీయ జనతా పార్టీ.. అధికార వైసీపీపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు జీవీఎల్, సునీల్ దేవధర్. బద్వేల్ ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార దుర్వినియోగం, హింస, బెదిరింపులు, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతోంది అంటూ సీఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.. కలసపాడు మండల బీజేపీ అధ్యక్షుడిని బెదిరించి వైసీపీలో చేర్చుకున్న అంశాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.. ఈ వ్యవహారంలో మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కాగా, వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే మృతిచెందడంతో.. బద్వేల్‌ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది.. ఓటర్లను ఆకర్షించేందుకు అధికార వైసీపీతో పాటు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అభ్యర్థులు తమ పార్టీల అగ్రనేతలను రంగంలోకి దింపి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలో వైసీపీ గెలిపించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు లేఖలు రాశారు. ఇక బీజేపీ కూడా అగ్రనేతలను రంగంలోకి దించి ప్రచారం నిర్వహిస్తోంది. కాంగ్రెస్‌ కూడా తమ బలం నిరూపించుకునే పనిలో ఉంది. ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య ఆకస్మిక మరణంతో జరుగుతున్న ఈ ఉప ఎన్నికలో అధికార పార్టీ తరఫున వెంకట సుబ్బయ్య సతీమణి సుధ బరిలో నిలవగా.. బీజేపీ నుంచి పనతల సురేశ్‌, కాంగ్రెస్‌ తరఫున మాజీ ఎమ్మెల్యే కుతూహలమ్మ పోటీ చేస్తున్నారు.. టీడీపీ, జనసేన పార్టీలు ఈ ఎన్నికకు దూరంగా ఉన్నారు.. ఈనెల 30న ఉప ఎన్నిక పోలింగ్‌ జరగనుండగా.. నవంబర్‌ 2వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

By admin

Leave a Reply

Your email address will not be published.