అమరావతి: రాష్ట్రంలోని మైదాన ప్రాంత గిరిజనులకు మరిన్ని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)లను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్విభజన చేయడంతో మైదాన ప్రాంతంలో ఏడు జిల్లాలకు ఐటీడీఏల ఏర్పాటు అత్యవసరమైంది. ఆయా జిల్లాల్లోని గిరిజనులకు సేవలు అందించేలా ఒకటి, రెండు ఐటీడీఏలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఇటీవల కేంద్రాన్ని కోరింది. రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం గిరిజన జనాభా 27.39 లక్షలు. వీరిలో 15.88 లక్షలమంది (58 శాతం) మైదాన ప్రాంతంలోనే నివసిస్తున్నారు. వారి అభివృద్ధి, సంక్షేమానికి మరిన్ని ఐటీడీఏల అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది.

రాష్ట్రంలో ప్రస్తుతం తొమ్మిది ఐటీడీఏలున్నాయి. వీటిలో విజయవాడ కేంద్రంగా ఉన్న మైదాన ప్రాంత ఐటీడీఏ మాత్రమే ఎస్టీలు తగినంత సంఖ్యలో ఉన్న ఏడుజిల్లాలకు సేవలందిస్తోంది. జిల్లాల పునర్విభజనలో రాష్ట్ర ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం..  రెండు పూర్తిస్థాయి గిరిజన జిల్లాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మైదానప్రాంత జిల్లాలైన అనంతపురం, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో గిరిజనులు గణనీయంగా ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది.

By admin

Leave a Reply

Your email address will not be published.