డాబాగార్డెన్స్‌ (విశాఖ దక్షిణ): భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. వేరే వ్యక్తితో ఉండడాన్ని కళ్లారా చూసి జీర్ణించుకోలేకపోయాడు. మరోవైపు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో కమీషన్‌ విషయంలో రియల్టర్లు మోసం చేయడంతో తట్టుకోలేకపోయాడు. అప్పటి నుంచి అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. భార్య, పిల్లలు దూరం కావడంతో మహిళలపై ద్వేషం పెంచుకుని సైకోలా మారాడు. వారం రోజుల వ్యవధిలో ముగ్గురిని కడతేర్చాడు. నగర శివారు పెందుర్తి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కలకలం రేపిన వరుస హత్యలకు సంబంధించిన వివరాలను పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం పోలీస్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌ వెల్లడించారు.

చందక రాంబాబు అలియాస్‌ సందక రాంబాబు (49) కోటవురట్ల మండలం ధర్మసాగరం గ్రామ నివాసి. 2006లో జీవనోపాధి కోసం హైదరాబాద్‌ వెళ్లాడు. అక్కడ రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌గా పనిచేస్తూ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అనంతరం 2013లో ఒంటిరిగా విశాఖపట్నం వచ్చి విమాననగర్‌లో ఉండేవాడు. భార్య, పిల్లలు ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో పనిచేస్తూ, హైదరాబాద్‌లోని భరత్‌నగర్‌లో నివసించేవారు. 2015లో ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో పనికి చేరిన రాంబాబు అప్పుడప్పుడూ హైదరాబాద్‌ వెళ్లి భార్య, పిల్లలను చూసేవాడు. ఈ క్రమంలో అతని భార్య హైదరాబాద్‌లో వారు నివసిస్తున్న ఇంటి యజమానితో వివాహేతర బంధం ఏర్పరచుకోవడంతో కుమిలిపోయాడు. భార్యతో గొడవ పడి 2018 మే 21న భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. అప్పటి నుంచి కుమారుడు, కుమార్తె కూడా రాంబాబును విడిచి పెట్టేసి తల్లి వద్దే ఉంటున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.