ఏపీలో ప్రైవేటు ఎయిడెడ్ స్కూళ్లను ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలన్న జగన్ సర్కార్ ప్రయత్నాలపై రచ్చ జరుగుతున్న నేపథ్యంలో విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ ఇవాళ దీనిపై స్పందించారు. ఇప్పటికే సీఎం జగన్ కూడా బలవంతపు విలీనాలు ఉండబోవని చెప్తున్నా స్కూళ్లు మూతపడుతుండటంతో విద్యార్ధుల తల్లితండ్రులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యామంత్రి స్పందించారు.
ఎయిడెడ్ విద్యా సంస్థలపై ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ.. కొన్ని పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న కథనాల నేపథ్యంలో కొన్ని వాస్తవాలను చెప్పేందుకు తాను స్పందిస్తున్నట్లు విద్యామంత్రి సురేష్ తెలిపారు. ప్రైవేట్ యాజమాన్యం కింద నడిచే విద్యాసంస్థల పనితీరుపై సర్కార్ వేసిన కమిటీ నివేదికలో వెలుగు చూసిన పలు అంశాలు ఆశ్చర్యానికి గురిచేశాయని సురేష్ వెల్లడించారు. . అ నివేదిక ఆధారంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నామన్నారు.
దీర్ఘకాలికంగా ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా, ఉపాధ్యాయులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్న పరిస్థితుల్లో ఎయిడెడ్ స్కూళ్లు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని ఆయన తెలిపారు.