‘ఇంట్లో నుంచి బండిని బయటకు తీసేందుకు జనం బెంబేలెత్తిపోతున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న పెట్రో, డీజిల్‌ ధరలతో ప్రతి కుటుంబమూ అవస్థలు పడుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ఇంధన ధరలను పెంచుకుంటూ పోతుండడంతో జనం తీవ్ర ఆవేదనకు గురౌతున్నారు. బుధవారం నాటికి పెట్రోల్‌ ధర లీటరు రూ.113.21కు, డీజిల్‌ ధర రూ.105.82కు చేరాయి. మంగళవారం కంటే బుధవారం పెట్రోల్‌ 35 పైసలు, డీజిల్‌ 36 పైసలు పెరిగాయి. వాస్తవానికి కేపిటల్‌ ప్రైజ్‌ (మూలధన ధర) పెట్రోల్‌ లీటరు రూ.40 మాత్రమే. కేంద్ర ప్రభుత్వం రూ.68, రాష్ట్ర ప్రభుత్వం రూ.28 పన్నులు విధించడంతో అమాంతంగా పెట్రో మంట మండుతోంది. రూ.68 పన్నుల రూపంలో ఆదాయం పొందుతున్న కేంద్రంలోని బిజెపి సర్కారు రాష్ట్రాల వాటాను ఇవ్వకుండా దగా చేస్తోంది. ముఖ్యంగా సెస్‌ పేరుతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచేస్తూ రాష్ట్రాలపై భారాలను మోపుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ పరిధిలో పన్ను వేసుకుని ఆర్థిక భారం నుంచి గట్టెకుతున్నా ప్రజలకు మాత్రం కడగండ్లు మిగులుతున్నాయి. రూ.113కు పెట్రో ధర చేరడంతో ఇంట్లో నుంచి వాహనాలను తీసేందుకు అనేక మంది సాహసించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ నగరంలో పెట్రోల్‌ దొంగతనాలు సైతం విచ్చలవిడిగా పెరిగిపోయాయి. పోలీసులు ఈ విషయంపై స్పందిస్తూ… టూ వీలర్లకు పెట్రో తాళాలను వేసుకోవాలంటున్నారు. డీజిల్‌ ధరలు వల్ల ఆటో కార్మికుల ఆదాయం పడిపోవడంతో వారి కుటుంబ పోషణ కష్టంగా మారింది. ఏదేమైనా ఎడాపెడా భారం ప్రజలు మోయాల్సి వస్తుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును వ్యతిరేకిస్తూ సిపిఎం, వామపక్ష పార్టీలు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథంలో నగరంలో వాహన దారులను పెట్రో, డీజిల్‌ ధరలపై ప్రజాశక్తి కదిలించగా లబోదిబోమంటున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.