విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన మహిళా గర్జన ర్యాలీ విజయవంతమైంది. పెద్ద సంఖ్యలో మహిళలు హాజరైన ఇందులో పాల్గొన్నారు. స్టీల్‌ప్లాంట్‌ తెలుగుతల్లి విగ్రహం పూలమాల వేసి ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ప్రారంభించారు. తెలుగుతల్లి విగ్రహం నుంచి ఉక్కు పరిపాలన భవనం వరకు ఈ ర్యాలీ సాగింది. అక్కడ ప్రధాన రహదారిపై నిరసన చేపట్టారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఉక్కు కర్మాగారం తమ బిడ్డల భవిష్యత్‌ అని, దాని జోలికొస్తే ఊరుకొనేది లేదని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానం ప్రజల భవిష్యత్తుకి, దేశ అభివృద్ధికి గొడ్డలి పెట్టని పేర్కొన్నారు. ఇటీవల ప్రధాని అమెరికా పర్యటనలో అక్కడి విలేకరి భారతదేశంలో జరుగుతున్న రైతాంగ ఉద్యమం, స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమాలను ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకపోయారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ ఝాన్సీ లక్ష్మి, మాజీ కార్పొరేటర్లు కె.విమల, పీలా ఉమారాణి, మాజీ కౌన్సిలర్‌ వై.వరలక్ష్మి, డిసిఎంఎస్‌ చైర్‌పర్సన్‌ పల్లా చినతల్లి, పోరాట కమిటీ మహిళా విభాగం నాయకులు బూసి పరమేశ్వరి, కె.వేణు, వై.సత్యవతి, ఎ.దీప్తి, వై.అరుణకుమారి, కె. సత్యవతి, సుమ, ఉష, సుశీల, పుష్య, లతా, వాణి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.