రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం విశాఖలో అభివృద్ధి పేరుతో విధ్వంసాలు చేస్తుందని టిడిపి నేతలు ఆరోపించారు. విశాఖలోని రుషికొండ వద్దనున్న హరిత రిసార్ట్స్‌ను తొలగించి, గ్రీన్ బెల్ట్ కొండను చదును చేయడాన్ని వ్యతిరేకిస్తూ టిడిపి ఆధ్వర్యాన బుధవారం రుషి కొండ వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా భారీగా పోలీసులను మోహరించారు. ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, టిడిపి విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ పకృతి సహజసిద్ధంగా వున్న రుషికొండను నాశనం చేసే విధంగా తవ్వేశారని తెలిపారు. మైన్స్ డిపార్టుమెంట్ పర్మిషన్ లేకుండా ఇదంతా చేస్తున్నారన్నారు. విశాఖ రాజధాని అని చెప్పి భూములు రెట్లు పెంచినట్లు ఆరోపించారు. ఈ కార్యక్రమానికి రాకుండా విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, భీమిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోరాడ రాజబాబు, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్‌ను హౌస్ అరెస్టు చేయడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ, గవిరెడ్డి రామానాయుడు, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు, టిడిపి నాయకులు పాశర్ల ప్రసాద్, ఎండీ నజీర్, విఎస్ఎన్ మూర్తి యాదవ్, లోడగల కృష్ణ, బొండా జగన్, గంటా నూకరాజు, పుచ్చ విజరు కుమార్, 5, 7 వార్డుల కార్పొరేటర్లు మొల్లి హేమలత, పిల్లా మంగమ్మ, అధిక సంఖలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.