విశాఖ స్టీల్‌ప్లాంట్, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నవంబర్ 1న నిర్వహించనున్న విద్యార్థి, యువజన ర్యాలీని జయప్రదం చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద బుధవారం మీడియా సమావేశంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి ఎల్జె.నాయుడు, ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.జాన్సన్‌బాబు, పిడిఎస్ఓ రాష్ట్ర కార్యదర్శి ఎ.సురేష్, పిడిఎస్యు రాష్ట్ర కార్యదర్శి రామ్మోహన్, ఎఐడిఎస్‌ఓ నాయకుడు అభిలాష్ మాట్లాడారు. స్టీల్‌ప్లాంట్ సాధన కోసం జరిగిన ఉద్యమంలో 1966 నవంబర్ 1న విశాఖలో గిరిజన కాల్పుల్లో అమరులైన వారిని స్మరించుకుంటూ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని చెప్పారు. 1న ఉదయం 10 గంటలకు ఎవిఎన్ కాలేజీ నుండి పాత పోస్టాఫీస్ వరకు 10వేల మందితో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశ భక్తి పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా కార్పొరేట్ సంస్థలను ధారాదత్తం చేస్తుందని, ఈ చర్యలను అడ్డుకోవాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో విద్యార్థి నాయకులు జి.ఫణీంద్ర కుమార్, కె.కుసుమ తదితరులు పాల్గొన్నారు.