తుళ్లూరు గ్రామానికి చెందిన మాదల శివలక్ష్మి తన ఇంట్లోని బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయని కొద్ది రోజుల క్రితం తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దర్యాప్తు ప్రారంభించిన తుళ్లూరు పోలీసులు కొద్ది రోజుల్లోనే దొంగలను పట్టుకొని చోరీకి గురైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం తుళ్లూరు పోలీస్టేషన్లో జరిగిన విలేకరుల సమావేసంలో సీఐ దుర్గాప్రసాద్ వివరాలు వెల్లడించారు. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌ల సహాయంతో కేసును ఛేదించామన్నారు. ఈ కేసులో కృష్ణా జిల్లా కొండపల్లిలో నివాసం ఉంటున్న చీకట్ల లక్ష్మణ్(29), జికొండూరుకు చెందిన పెద్దగామల విజయ లక్ష్మిల(25)ను ఇబ్రహీంపట్నంలో అరెస్టు చేసి బంగారు ఆభరణలైన ఐదు పేటల గొలుసు, రెండు జతల చెవికమ్మలు, రెండు ఉంగరాలు, చీరలను వారివద్ద నుంచి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితుడు లక్ష్మణ్‌కి గతంలో గన్నవరంలో ఒకటి, పాతగుంటూరులో మూడు, ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో 4 కేసుల్లో నేరచరిత్ర ఉందన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సీఐ దుర్గాప్రసాద్, ఎస్సై సోమేశ్వరరావు, ఏఎస్ఐ సాంబశివరావు, పీసీలు అంకమ్మరావు, స్వప్నలను తుళ్లూరు డీఎస్పీ వి.పోతురాజును అభినందించారు.