హైదరాబాద్‌: తెలంగాణలో బీజేపీ, అధికార టీఆర్‌ఎస్‌ మధ్య పొలిటికల్‌ వార్‌ నడుస్తోంది. రెండు పార్టీల నేతలు పరస్పర ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జాతీయ రాజకీయాలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్‌.. ఆదివారం బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే.కాగా, కేసీఆర్‌ బీహార్‌ పర్యటనపై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ సీనియర్‌ నేత, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్‌.. సీఎం బీహార్‌ పర్యటనపై స్పందించారు. ఎంపీ లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడుతూ.. బీహార్‌ పర్యటనతో కేసీఆర్‌ అభాసుపాలయ్యారు. కేసీఆర్‌ ఉచ్చులో నితీష్‌ కుమార్‌ చిక్కుకున్నారు. కేసీఆర్‌ వ్యాఖ్యల ద్వారా మరోసారి టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య బంధం బహిర్గతమైంది. ఆనాడు కాంగ్రెస్‌ పార్టీ ఎమర్జెన్సీ విధిస్తే.. నేడు తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్బంధాలు, ఆంక్షలు, అరెస్టులతో ఎమర్జెన్సీ తలపిస్తోంది.

తెలంగాణలో ధాన్యం కుప్పల మీద రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబాలను ఆదుకోని సీఎం కేసీఆర్‌.. బీహార్‌ వెళ్లి అక్కడి వారికి చెక్కులు ఇవ్వమేంటి?. కన్న తండ్రికి బువ్వపెట్టని కొడుకు.. మేనమామకు మంగళ హారతి పట్టిన చందంగా కేసీఆర్‌ తీరు ఉందని ఎద్దేవా చేశారు. ఇక, టీడీపీతో పొత్తు అనేది ఊహాజనిత, అసత్య ప్రచారం మాత్రమే.. ఏపీలో పవన్‌తో కలిసి బీజేపీ ముందుకెళ్తోంది. తెలంగాణలో మాత్రం ఒంటిరిగా పోటీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు.

By admin

Leave a Reply

Your email address will not be published.