విజయవాడ: ‘‘సానపట్టకముందు వజ్రం కూడా రాయి మాదిరిగానే ఉంటుంది. మంచి శిల్పి చేతిలో పడితే ఆ రాయి అద్భుతమైన శిల్పంగా మారుతుంది. అలాంటి అద్భుత శిల్పాలను చెక్కే శిల్పులు మన ఉపాధ్యాయులు. మంచి టీచర్‌ స్కూల్, ఒక వ్యవస్థను మార్చగలుగుతాడు. అలాంటి మన ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక వందనాలు’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గురువులకు వందనం, నాకు చదువు నేర్పిన గురువులకు, అనేక తరాలకు చదువులు నేర్పుతున్న గురువులకు శిరస్సు వంచి వందనాలు చేస్తున్నా. ఉపాధ్యాయులందరికీ కూడా ఒక శిఖరం లాంటి వ్యక్తి మన సర్వేపల్లి రాధాకృష్ణ. మాజీ రాష్ట్రపతి, మన తెలుగువారు ఈ స్థాయికి తాను ఎదగడమే కాకుండా ఏకంగా టీచర్లందరినీ ఎత్తైన‌ శిఖరంలో నిలబెట్టిన గొప్ప వ్యక్తికి వందనమన్నారు సీఎం వైయస్‌ జగన్‌.

విజయవాడ ఏ కన్వెన్షన్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టీచర్స్‌ డే వేడుకలకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం సీఎం ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యా రంగంలో ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, ఉపాధ్యాయుల కీలక పాత్ర గురించి వివరించారు.

ఈ సందర్భంగా సీఎం ఏం మాట్లాడారంటే..
మన రాష్ట్రంలో ఇటు ప్రభుత్వ రంగంలోనూ, ప్రైవేట్‌ రంగంలోనూ, ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లోనూ పనిచేస్తున్న టీచర్లకు, లెక్చరర్లకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు జన్మనిచ్చిన నా తండ్రికి రుణపడి ఉంటాను. ఈ జన్మను సార్థకం చేస్తూ మెరుగైన జీవితాన్ని పొందడం ఎలాగో నేర్పినందుకు నాకు గురువుకు రుణపడి ఉంటాను. ఎంతో స్ఫూర్తిదాయకమైన మాటలు. ఈ మాటలు నేను చెప్పడమే కాదు.. ప్రపంచ ఖ్యాతి గాంచిన అల్జెండర్‌ ది గ్రేట్‌ కూడా చెప్పారు.

సానపట్టక ముందు వజ్రం అయినా రాయి మాదిరిగానే ఉంటుంది. మంచి శిల్పి చేతిలో పడితే ఆ రాయి కూడా ఒక అద్భుతమైన శిల్పంగా మారుతుంది. అలాంటి అద్భుత శిల్పాలను చెక్కే శిల్పులు మన ఉపాధ్యాయులు. మంచి టీచర్‌ స్కూల్‌ను మార్చగలుగుతాడు. ఒక వ్యవస్థను మార్చగలుగుతాడు. ఒక గ్రామంతో మొదలుపెడితే.. ఒక విప్లవాత్మక మార్పును తీసుకురాగలుగుతాడు. ఒక మంచి టీచర్‌ తాను కన్న పిల్లల భవిష్యత్‌ కోసం ఎంతగా తపిస్తాడో.. తన తరగతిలో ఉన్న ప్రతీ పిల్లాడూ అదే మాదిరిగా బాగుపడాలని ఆరాటపడతాడు. ఒక మంచి టీచర్‌ తన విద్యార్థులకు కేవలం సబ్జెక్ట్‌ మాత్రమే చెప్పడు.. వ్యక్తిత్వాన్ని కూడా మలుస్తాడు. వారి ఆత్మవిశ్వాసాన్ని, వారి విజ్ఞానాన్ని, వివేకాన్ని పెంచడంలో ఉపాధ్యాయుడు చాలా కీలక పాత్ర పోషిస్తాడు. వారిలో దాగిన ప్రతిభను బయటకు తీయడంలో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాడు. క్రమశిక్షణతో జీవించడం, బ్రతకడం ఎలాగో నేర్పే స్కిల్స్‌ టీచర్‌దగ్గర నుంచే వస్తాయి. పిల్లల భవిష్యత్‌కు బాటలు వేస్తాడు.. తన దగ్గర చదువుకున్న పిల్లలంతా తనకంటే ఇంకా గొప్పవారు కావాలని ఆరాటపడతాడు. అది సాధించినప్పుడు సంతోషిస్తాడు.

By admin

Leave a Reply

Your email address will not be published.