హైదరాబాద్‌: హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌–న్యూ) అధికారులు గత నెలలో అరెస్టు చేసిన గోవా డ్రగ్‌ పెడ్లర్‌ ప్రీతీష్‌ నారాయణ్‌ బోర్కర్‌కు పెద్ద బ్యాగ్రౌండే ఉంది. గోవా పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన డ్రగ్‌ డీలర్‌ సదానంద్‌ చిముల్కర్‌కు సమీప బంధువు ఇతడు. భూయ్‌ అనే మారు పేరు కూడా ఉన్న చిముల్కర్‌ 2010–14 మధ్య గోవా సహా అనేక రాష్ట్రాల పోలీసులను పరుగులు పెట్టించాడు. ప్రీతీష్‌ను ఇటీవల తమ కస్టడీలోకి తీసుకున్న పోలీసులు లోతుగా విచారించగా అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

గోవాలోని అంజునా బీచ్‌ కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లో ఏళ్లుగా డ్రగ్స్‌ దందా చేస్తూ దాదాపు 600 మంది కస్టమర్లు కలిగి ఉన్న ఘరానా పెడ్లర్‌ ప్రీతీష్‌ నారాయణ్‌ బోర్కర్‌ను హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌–న్యూ) గత నెల 17న పట్టుకుంది. ఇతడికి డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న స్టీవెన్, ఎడ్విన్‌ నూనిస్‌లకు బీజేపీ నేత, టిక్‌టాక్‌ స్టార్‌ సొనాలీ ఫోగాట్‌ హత్య కేసుతోనూ సంబంధాలు బయటపడ్డాయి.

అంజునా ప్రాంతానికి చెందిన డ్రగ్స్‌ డాన్‌ సదానంద్‌ అలియాస్‌ భుయ్‌ చిముల్కర్‌కు ప్రీతీష్‌ బోర్కర్‌ సమీప బంధువు. సదానంద్‌ జీవశైలి, సంపాదన, డబ్బు ఖర్చు చేసే విధానం..ఇవన్నీ చూసిన ప్రీతీష్‌ తానూ డ్రగ్స్‌ దందా చేయాలని నిర్ణయించుకున్నాడు. సదానంద్‌కు సరఫరా చేసే వారి నుంచే ఎండీఎంఏ, ఎల్‌ఎస్‌డీ, ఎక్స్‌టసీ, కొకైన్‌ తదితర మాదకద్రవ్యాలు ఖరీదు చేసే అమ్మడం మొదలెట్టాడు.

By admin

Leave a Reply

Your email address will not be published.