విజ‌య‌వాడ‌: ఉద్యోగుల భవిష్యత్తు గురించి ఎంతో ఆలోచించిన తర్వాతే గ్యారంటీడ్‌ పెన్షన్‌ స్కీమ్‌(జీపీఎస్‌) తెస్తున్నట్లు మంత్రుల కమిటీ తెలిపింది. ఉద్యోగుల పెన్షన్‌ ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కమిటీ స్పష్టం చేసింది. వెలగపూడిలోని సచివాలయంలో ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) అంశంపై మంత్రుల కమిటీ సభ్యులైన బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమయ్యారు.

సీపీఎస్‌ కంటే మెరుగ్గా జీపీఎస్‌ను తెస్తున్నామని, ఇది ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షించేలా ఉంటుందని వివరించారు. ఆర్థిక శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ఎస్‌ రావత్, ముఖ్య కార్యదర్శి (హెచ్‌ఆర్‌)చిరంజీవి చౌదరి, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్‌.గుల్జార్, జీఏడీ కార్యదర్శి (సర్వీసెస్, హెచ్‌ఆర్‌) హెచ్‌.అరుణ్‌ కుమార్, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు ఈ చర్చల్లో పాల్గొన్నారు.

ఉద్యోగ సంఘాల తరపున ఏపీ ఎన్జీవోల అసోసియేషన్‌ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, ఏపీ సెక్రటేరియట్‌ ఉద్యోగుల అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ, పలు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఇతర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.

చట్టపరమైన సదుపాయాలు: బుగ్గన
జీపీఎస్‌ విధానంలో హామీ పింఛను, హామీ కుటుంబ భద్రత, హామీ కనీస పింఛను–ఆరోగ్య భద్రత, ప్రమాదవశాత్తు మరణం–వైకల్య బీమా సౌకర్యాన్ని చట్టపరంగా కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తెలిపారు. ఈ విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆమోదాన్ని తెలపాలని కోరారు.

మరోసారి చర్చలు : బొత్స
జీపీఎస్‌పై పలు దఫాలుగా ఉద్యోగులతో చర్చించామని, ఫైనల్‌ అయ్యాక దానికి చట్ట బద్ధత కల్పిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తుది డ్రాఫ్ట్‌ గురించి ఉద్యోగులకు వివరించామని చెప్పారు. రిటైర్‌ అయ్యాక గ్యారంటీగా కనీసం రూ.10 వేలు పెన్షన్‌ ఉండేలా మార్పు చేశామన్నారు. పెన్షనర్‌ చనిపోతే భార్య లేదా భర్తకు పెన్షన్‌ వస్తుందని, హెల్త్‌ కార్డులు కూడా ఉంటాయని చెప్పారు. ఉద్యోగులతో మరోసారి చర్చలు జరుపుతామన్నారు. వారిపై పెట్టిన కేసుల ఎత్తివేతపై సీఎంతో చర్చిస్తామన్నారు. గురుకులాలు, యూనివర్సిటీల్లో బోధన, బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

By admin

Leave a Reply

Your email address will not be published.