ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉంటాయని 2019 డిసెంబర్ 17న సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయరాజధానిగా కర్నూలును నిర్ణయించినట్లు ప్రకటించారు. అప్పుడే అంటే 2019 డిసెంబరు 19న అమరావతి రైతుల ఉద్యమం ఊపిరి పోసుకుంది. కష్టాలు, నష్టాలకోర్చి, కరోనా కాలాన్ని సైతం అధిగమించి 1000 రోజులకు చేరువవుతోంది. 2019 డిసెంబరు 20న రిలే నిరాహార దీక్షలతో మొదలైన ఉద్యమం 2020 జనవరి 5న తుళ్లూరు నుంచి మందడం వరకూ సాగిన 29 గ్రామాల రైతుల పాదయాత్రతో ఊపందుకుంది. విజయవాడ దుర్గమ్మకు ముడుపులు చెల్లించుకునేందుకు ఉద్యమంగా బయలుదేరిన మహిళలను ప్రకాశం బ్యారేజీ వద్ద పోలీసులు అడ్డుకుని లాఠీచార్జ్ చేశారు. దీనికి నిరసనగా.. జనవరి 7న రైతులు, మహిళలంతా కలిసి హైవే దిగ్బంధనం చేశారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని కేబినెట్‌ ఆమోదించడాన్ని నిరసిస్తూ జనవరి 20 చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. దీనికి ప్రభుత్వం ఊరుకుంటుందా? దమనకాండకు పాల్పడింది. కొండవద్దకు పాదయాత్ర, 29 గ్రామాల్లో బైక్‌ ర్యాలీ, కోటప్పకొండకు ర్యాలీ నిర్వహించి ఉద్యమాన్ని మరో అడుగు ముందుకు వేయించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.