కలెక్టరేట్ : విధి నిర్వహణలో కరోనా బారిన పడి మృతిచెందిన డాక్టర్ల కుటుంబాలకు రూ.50 లక్షలు చొప్పున నష్టపరిహారం అందించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) జాతీయ అధ్యక్షులు జెఎ జైలాల్ డిమాండ్చేశారు. కేంద్ర ప్రభుత్వం రూ.50 లక్షలు చెల్లిస్తామని ప్రకటించినా అమలు చేయకుండా తాత్సారం చేయడం సరికాదన్నారు. అంకోసా భవనంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా కరోనా బారినపడి సుమారు వెయ్యి మంది డాక్టర్లు మరణించారని చెప్పారు. ఎపిలో మృతిచెందిన డాక్టర్లకు కేంద్ర సాయంతో పాటు ఎపి ప్రభుత్వం కూడా ఆర్థిక సహాయం అందించాలన్నారు. విధుల్లో ఉన్న డాక్టర్లపై ప్రజలు దాడులకు పాల్పడటం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్టులో ఆరోగ్యానికి 4శాతం నిధులు కేటాయించాలని కోరారు. ఐఎంఎ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జయేష్ లేలే మాట్లాడుతూ, భారతదేశంలో మిక్సోపతి వైద్య విధానాన్ని అనుమతించడం మంచిది కాదన్నారు. ఆయుర్వేద వైద్యులు ఆపరేషన్లు చేయడం సమాజానికి ప్రమాదకరమన్నారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్.సుబ్రహ్మణ్యం ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి.నందకిషోర్, డాక్టర్ ఎం.సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు.