తాడేప‌ల్లి: తనకు ‘ప్రాణప్రదమైన’ రాజధాని అమరావతిపై చట్టసభలో చర్చ జరుగుతుందని తెలిసి కూడా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు ముఖం చాటేయడం వింతగా ఉంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. వికేంద్రీక‌ర‌ణ‌పై జ‌రిగిన చ‌ర్చ‌లో ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు పాల్గొన‌క‌పోవ‌డంపై విజ‌య‌సాయిరెడ్డి తప్పుప‌ట్టారు. ఈ మేర‌కు ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

మళ్లీ శాసనసభలో అడుగుపెట్టనని చెప్పిన తెలుగుదేశం నాయకుడు చంద్రబాబుకు ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ కావడానికి సమయం దొరికింది. ఎలాగైనా తన కలల ప్రాజెక్టు అమరావతిని ఏపీ ఏకైక రాజధానిని చేయడంపై తన వాదనలు వినిపించే అవకాశాన్ని చంద్రబాబు కోల్పోయారు. పోనీ, తన ఎమ్మెల్యేలతోనైనా ఆ పని చేయించారా? అంటే అదీ లేదు. యుద్ధసమయంలో తన సేనలను నడిపించాల్సిన సేనాధిపతి సమరక్షేత్రం నుంచి పారిపోయినట్టు చంద్రబాబు ఎంతో విలువైన చట్టసభ సభ సమావేశం జరుగుతుండగా ఇంట్లో కూర్చునిపోయారు.

పార్లమెంటరీ ప్రజాస్వామ్యం గురించి ఉపన్యాసాలు దంచే బాబు గారు విధానసభలో తన రాజ్యాంగబద్ధమైన పాత్రను నిర్వహించాలి కదా! తాను అధికారంలో ఉన్న ఐదేళ్లలో నాలుగింట మూడొంతుల సమయం, తన ‘శక్తి, సామర్ధ్యాలను’ అమరావతి డిజైన్లు, నిర్మాణానికి చంద్రబాబు గారు కేటాయించారు. మరి తాను నిర్మించ తలపెట్టిన రాజధాని నగరంపై ఆయనకు అంత మక్కువ, పట్టుదల ఉంటే శాసనసభకు వచ్చి తన పార్టీ సభ్యులను సజావుగా నడిపించవచ్చు.

స్వయంగా మాట్లాడవచ్చు. అంతటి బరువు బాధ్యతలు తీసుకోవడానికి కుప్పం ఎమ్మెల్యేగారు ఎందుకో ఇష్టపడడంలేదు. కీలక అంశాలపై, తనకు అతి ముఖ్యమనుకున్న విషయాలపై చర్చ జరుగుతున్నప్పుడైనా పవిత్రమైన చట్టసభకు వెళ్లాలన్న సలహా సభలో అత్యంత సీనియర్‌ రాజకీయవేత్త అయిన చంద్రబాబుకు ఎవరు ఇవ్వాలి? సమస్యలకు చాలా వరకు చట్టసభల్లో మాత్రమే పరిష్కారాలు దొరుకుతాయని 14 ఏళ్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న విపక్ష నేతకు తెలియదా?

By admin

Leave a Reply

Your email address will not be published.