సిపిఎం జోన్ మహాసభలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలను ఏకగ్రీవంగాఆమోదించారు. నూతన కమిటీలను ఎన్నుకున్నారు.
మోడీ విధానాలతో అసమానతలు
గాజువాక : బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ తీసుకున్న విధానాల వల్ల ప్రజల మధ్య అసమానతలు పెరిగాయని సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు కెఎం.శ్రీనివాసరావు పేర్కొన్నారు. సిపిఎం గాజువాక జోన్ మహాసభ మింది కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ముందు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగ సంస్థలను నాశనం చేస్తున్నారని విమర్శించారు. నోట్ల రద్దు తర్వాత చిన్న పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. జీఎస్టీకి సంబంధించి రాష్ట్రాలకు రావాల్సిన వాటాను సరిగా ఇవ్వడంలేదన్నారు. దేశంలో అభద్రతాభావం పెరిగిందన్నారు. వీటన్నింటిని కప్పిపుచ్చుకునేందుకు బిజెపి మతకల్లోలాలు, కులాల మధ్య చిచ్చు పెడుతోందని విమర్శించారు. ఇటువంటి విధానాలపై సిపిఎం పోరాడుతోందన్నారు. దోపిడీ లేని సమాజం కోసం సిపిఎం పనిచేస్తుందన్నారు.
