వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా సత్తా చాటాల్సిన పరిస్థితి ఏపీలోని పలు రాజకీయ పార్టీలకు ఏర్పడింది. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన జనసేన గురించే. ఒక ఎన్నికలకు దూరంగా ఉండి.. మరో ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన జనసేన.. రాబోయే ఎన్నికల్లో మాత్రం మంచి ఫలితాలు సాధించాలని ప్లాన్ చేస్తోంది. రాబోయే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తామని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాకపోయినా.. అధికారం ఎవరికి దక్కాలో శాసించే స్థాయిలో అయినా ఉండాలని జనసేన భావిస్తోంది. అందుకోసం ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది. ఏపీలోని మెజార్టీ స్థానాల్లో పోటీ టీడీపీ, వైసీపీ మధ్యే ఉంటుంది. అయితే కోస్తాంధ్రలోని కొన్ని జిల్లాలో మాత్రం ఈ పార్టీలకు జనసేన పోటీ ఇచ్చే స్థాయిలో ఉంది. ఈ విషయం గత ఎన్నికల్లో కూడా రుజువైంది. అలాంటి స్థానాలను గుర్తించే పనిలో ఉన్న జనసేన.. వాటిపై ఇప్పటి నుంచే ఫోకస్ చేయాలని భావిస్తోంది.

గోదావరి జిల్లాలతో పాటు ఉత్తర కోస్తాలోని కొన్ని జిల్లాలు, కృష్ణా, గుంటూరులోని కొన్ని నియోజకవర్గాలపై జనసేన ఎక్కువగా దృష్టి పెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో చాలా సీరియస్‌గా ఉండాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్.. అభ్యర్థుల ఎంపికను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని తెలుస్తోంది. కనీసం నలభై నుంచి యాభై స్థానాల్లో ప్రత్యేక దృష్టి పెట్టేందుకు ఒక సంస్థతో సర్వే చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయించినట్టు జనసేన వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ఏడాది ముందు ఈ సర్వే చేస్తే సరైన ఫలితం వస్తుందని ఆయన భావిస్తున్నారని టాక్.

By admin

Leave a Reply

Your email address will not be published.