వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ సేవల పోర్టల్‌ ‘ధరణి’ నేటితో ఏడాది పూర్తి చేసుకుంది. గతేడాది అక్టోబరు 29న మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లిలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పోర్టల్‌ను ప్రారంభించారు. ఏడాది కాలంలో 10 లక్షల లావాదేవీల సంఖ్యను అధిగమించింది. పాత ఆర్‌ఓఆర్‌ చట్టం స్థానంలో ప్రభుత్వం ‘తెలంగాణ పాసుపుస్తకాలు, భూమి హక్కుల చట్టం-2020’తోపాటు ధరణి పోర్టల్‌ను (ఎలక్ట్రానిక్‌ రూపంలోని దస్త్రాలు) గతేడాది ప్రారంభించింది. తహసీల్దార్లకు సంయుక్త సబ్‌ రిజిస్ట్రార్‌ అధికారాలను కట్టబెట్టింది. అప్పటివరకు రాష్ట్రంలో 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల ద్వారానే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరిగేవి. మ్యుటేషన్లకు మాత్రం తహసీల్దారు కార్యాలయాలకు దస్త్రాలు పంపేవారు. ఈ క్రమంలో జాప్యం చోటుచేసుకుంటుండటం, కొన్నిచోట్ల అవినీతికి ఆస్కారం ఏర్పడుతోందని ఈ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ధరణి ద్వారా రాష్ట్రంలోని 574 తహసీల్దారు కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభించారు. భూముల రిజిస్ట్రేషన్‌ అనంతరం 10 రోజులకు మ్యుటేషన్‌ పూర్తయ్యే విధానం స్థానంలో ధరణి ద్వారా ఏక కాలంలో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ విధానాన్ని తీసుకొచ్చారు. పోర్టల్లో మూడు నిమిషాల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతోంది. సగటున 47 నిమిషాల సమయం పడుతోంది.

By admin

Leave a Reply

Your email address will not be published.