అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమమే సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్యేయమని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. అందుకే ఆర్థికభారమైనప్పటికీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారన్నారు. విజయవాడలో నిర్వహించిన నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ(ఎన్‌ఎంయూ) రాష్ట్ర మహాసభల్లో ఆయన ప్రసంగించారు. కోవిడ్‌ వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు అండగా నిలిచిందన్నారు.

ఎన్నో ఏళ్లుగా ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తమ ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరిస్తోందన్నారు. స్టాఫ్‌ రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ పథకం పునరుద్ధరణ, పాత పద్ధతిలో ఆర్టీసీ ఉద్యోగులకు మెడికల్‌ పాలసీ అమలు తదితర అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. ఆర్టీసీ చైర్మన్‌ ఎ.మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌ కుటుంబానికి ఆర్టీసీ ఉద్యోగులపట్ల మొదటి నుంచి సానుకూలత ఉందన్నారు. 2004లో తీవ్రనష్టాల్లో ఉన్న ఆర్టీసీని వైఎస్సార్‌ ఆదుకున్నారని గుర్తుచేశారు.

ప్రస్తుతం సీఎం వైయ‌స్ జగన్‌ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంచేసి ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్‌ను నెరవేర్చారన్నారు. ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు, ఎన్‌ఎంయూ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, ప్రభుత్వ ఉద్యోగుల వ్యవహారాల సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్టీసీ ఈడీ కోటేశ్వరరావు, ఏపీఎన్‌జీవోల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బండి శ్రీనివాసరావు, కె.వి.శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.