విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు జీవితంలో ఏనాడైన బీసీలకు న్యాయం చేశారా అని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్ర‌శ్నించారు. బీసీ న్యాయమూర్తులకు పదవులు రాకుండా అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు అని మండిప‌డ్డారు. చంద్రబాబు ఎవరినైనా బీసీని రాజ్యసభకు పంపించావా అని ప్ర‌శ్నించారు. బీసీల తోకలు కట్‌ చేస్తానన్న వ్యక్తి చంద్రబాబు అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసింద‌ని మంత్రి కారుమూరి తెలిపారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఎంతమంది బీసీలు రాజ్యసభకు వెళ్లారో ప్రజలకు తెలుసు. మంత్రి వర్గంలోని 25 మందిలో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు మంత్రులుగా ఉన్నారు. చంద్రబాబు హయాంలో ఎప్పుడైనా బీసీలకు ప్రాధాన్యత ఉందా అని ప్రశ్నించారు. విశాఖ‌ప‌ట్నంలో మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు.

మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఏమన్నారంటే..

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి గంట నుంచే.. వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, పేద వర్గాలకు అన్నింటా పెద్దపీట వేస్తూ.. గత మూడేళ్ళుగా ‘బహుజన హితాయ… బహుజన సుతాయ’అన్నట్టుగా పరిపాలన చేస్తున్నారు. అలాంటి ముఖ్యమంత్రిపై చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి. తొలి మంత్రివర్గంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం చోటు కల్పించారు. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణలో 70శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు స్థానం కల్పించి భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా బీసీలకు పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి.

– వైయ‌స్‌ జగన్‌ఏలూరులో బీసీ గర్జన పెట్టి, అధికారంలోకి రాగానే, బీసీలకు అన్నింటా పెద్దపీట వేస్తామని, వారికి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా న్యాయం చేస్తామని ఇచ్చిన డిక్లరేషన్‌ కు కట్టుబడి, గత మూడేళ్ళ పరిపాలనలో చేతల్లో చేసి చూపించారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం, బీసీ కులాలపై అధ్యయనం చేసి, 139 బీసీ కులాలను వెలికి తీసి, వారికి 56 కార్పొరేషన్లు పెట్టి, వారందరికీ చైర్మన్‌ పదవులు కట్టబెట్టారు. బీసీల్లో అట్టడుగున ఉన్న కులాలను కూడా గుర్తించి, వారికి ఉన్నత పదవులు కల్పించి, సమాజంలో గుర్తింపు తెచ్చిన ముఖ్యమంత్రిగా వైయ‌స్‌ జగన్ చిరస్థాయిగా నిలిచిపోతారు. నాడు వైయ‌స్‌ రాజశేఖర రెడ్డి, ఇవాళ వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వాలవల్లే తాము ఉన్నత చదువులు చదువుకోగలుగుతున్నామని, ఇవాళ ఏ ఇంటికి వెళ్ళినా, ప్రతి పేద వాడూ, నిరుపేద విద్యార్థులు చెబుతున్నారు. రిక్షా తొక్కుకుని జీవనం సాగించే వ్యక్తి కొడుకు కూడా ఈరోజు ఫీజు రియంబర్స్‌మెంట్‌ పథకం ద్వారా ఉన్నత చదువులు చదివి, విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. విద్య ద్వారా లక్షలాదిమంది కుటుంబాల జీవన స్థితిగతులు మారే అవకాశం కలిగింది. తండ్రికి తగ్గ తనయుడిగా వైయస్సార్‌ ఆశయాలను అమలు చేస్తూ.. వైయ‌స్‌ జగన్‌ నాలుగు అడుగులు ముందుకు వేసి ‘నాడు-నేడు’ కార్యక్రమం చేపట్టి ప్రభుత్వ స్కూళ్ళు- ఆసుపత్రుల్లో మౌలిక వసతులతో పాటు పేదలకు ఇంగ్లీష్‌ మీడియం విద్యను అందుబాటులోకి తెచ్చారు.

By admin

Leave a Reply

Your email address will not be published.