విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలో ఉండేవిధంగా కాపాడుకోవడం మన అందరి కర్తవ్యమని హెచ్‌ఎస్‌ఎల్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎన్‌టియుసి) కార్యదర్శి ప్రసాదరావు అన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోరుతూ విశాఖ కార్మిక, ప్రజా సంఘాల జెఎసి ఆధ్వర్యంలో జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన దీక్షలు గురువారం నాటికి 210వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ భారత దేశంలోనే అగ్రగామి ఉక్కు కర్మాగారంగా పేరుపొందిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేయడం దుర్మార్గమన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటులో గాని, ఇందుకోసం జరిగిన పోరాటంలో గాని ఏమాత్రం ప్రమేయం లేని బిజెపి ఇప్పుడు తగుదునమ్మా అంటూ దానిని అమ్మచూస్తోందని విమర్శించారు. దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌ సంస్థలకు అమ్మివేయటం ద్వారా బిజెపికి పరోక్షంగా ఎన్ని వేల కోట్లు అక్రమంగా అందనున్నాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలుగు వారి పౌరుషాన్ని బిజెపి పాలకులు గుర్తించాలని, లేకుంటే వారికి పుట్టగతులుండవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు సి.అమ్ముడు, పి.అరుణ బి.వెంకటలక్ష్మి, డి.పార్వతమ్మ, సిహెచ్‌.రాణి, హెచ్‌ఎస్‌ఎల్‌ కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.