పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-750 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు క్వార్టర్‌ ఫైనల్లో ప్రవేశించింది. మహిళల సింగిల్స్‌ విభాగంలో గురువారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సింధు 21-19, 21-9తో క్రిస్టోఫర్‌సెన్‌ (డెన్మార్క్‌)పై అద్భుత విజయాన్ని సాధించింది. తొలి గేమ్‌లో 0-5తో వెనుకబడిన సింధు అనంతరం తేరుకొని ఆ గేమ్‌ను సొంతం చేసుకుంది.

ఇక రెండో గేమ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఆమె గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో లక్ష్యసేన్‌ (భారత్‌) 21-17, 21-13తో లో కీన్‌ య్యూ (సింగపూర్‌)పై నెగ్గాడు. హిరెన్‌ రుస్తావిటో (ఇండోనేసియా)తో జరిగిన మ్యాచ్‌ నుంచి సమీర్‌ వర్మ (భారత్‌) గాయంతో మధ్యలోనే వైదొలిగాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ రెండో రౌండ్‌లో భారత ద్వయం అశ్విని పొన్నప్ప-సాత్విక సాయిరాజ్‌ 21-15, 17-21, 19-21తో రెండో సీడ్‌ మెలాటి ఒక్తవియాంటి-ప్రవీణ్‌ జొర్డాన్‌ (ఇండోనేసియా) జంట చేతిలో పోరాడి ఓడింది.

By admin

Leave a Reply

Your email address will not be published.