ఏజెన్సీ ప్రాంతంలోని అన్ని గ్రామాలను కలుపుతూ రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశమందిరంలో అధికారులతో కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లు, ఇతర మౌలిక వసతులు లేక గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారని, వారికి అవసరమైన సౌకర్యాలను కల్పించవలసిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు.
ఐటిడిఎ పిఒ గోపాలకృష్ణ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఏజెన్సీ పరిధిలో చేపడుతున్న పనులను కలెక్టర్‌కు వివరించారు. 11 మండలాలలో తహశీల్దార్లు, ఎంపిడిఒలు, డివిజన్‌ స్థాయి అధికారులతో మండలాలు, గ్రామ పంచాయితీల వారిగా హేబిటేషన్లపై వర్క్‌ షాపులను నిర్వహించి డేటాను సేకరించినట్లు చెప్పారు. డెమోగ్రఫీ, రోడ్ల కనెక్టివిటీ, తాగునీరు, విద్యుత్తు, హౌసింగ్‌, విద్య, వైద్యం, ఐసిడిఎస్‌, ఆర్‌ఒఎఫ్‌ఆర్‌, పశుసంవర్థకం, వైఎస్‌ఆర్‌ కెపి, మొబైల్‌, ఇంటర్నెట్‌ కనెక్షన్‌, ట్రాన్స్‌ పోర్టు, పోస్టాఫీసు, బ్యాంకులు శాఖలకు సంబంధించి డేటాను తయారు చేసినట్లు తెలిపారు. ప్రతి శాఖకు సంబంధించి ఆయా హేబిటేషన్‌కు సంబంధించిన పూర్తి ప్రోపైల్‌ను సేకరించినట్లు పేర్కొన్నారు. 11 మండలాలలో 3,574 హేబిటేషన్‌లు, 6,04,047 జనాభా, 1,21,727 కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. 1,839 హేబిటేషన్లకు మట్టి రోడ్లు, బిటి, సిసి రోడ్లు మొత్తం 1,494 పనులు, 4,421 కిలో మీటర్ల మేర రోడ్ల నిర్మాణాలను చేపట్టాల్సి ఉందని తెలిపారు.

By admin

Leave a Reply

Your email address will not be published.