భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ను మరో మూడేళ్ల పాటు కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. 2018లో అప్పటి ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా అనంతరం దాస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది డిసెంబర్ 10తో శక్తికాంత దాస్ పదవీకాలం ముగియనుంది. గత మూడేళ్ల కాలంలో దాస్ ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయాలు ఆర్థికవ్యవస్థ వృద్ధికి చాలా కీలకంగా మారాయి.
నోట్ల రద్దు నుంచి విదేశీ మారకపు నిల్వల వరకు అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా కొవిడ్-19 మహమ్మారి సంబంధిత సవాళ్లను సమర్థవంతంగా నిర్వహించారు. ఇప్పటికీ కరోనా సద్దుమణగలేదు. ఈ నేపథ్యంలో ఆర్థికవ్యవస్థ వృద్ధి కోసం దాస్ పదవీకాలాన్ని మరో మూడేళ్లకు పొడిగించారు.